భారత్ చేసిన సాయానికి కృతజ్ఞతగా... కరోనాను ఎదుర్కొవడానికి అధునాతన వైద్య పరికరాలను పంపించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు భారత్‌తో సంబంధాలు మరింత విస్తృతం చేసుకునే విధంగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ 7న భారత్ 5 టన్నుల ఔషధాలను ఇజ్రాయెల్‌కు పంపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అభ్యర్థన మేరకు.. కీలకమైన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సైతం భారీగా సరఫరా చేసింది.
ఈ నేపథ్యంలో భారత్‌కు తిరిగి సాయం చేసింది ఇజ్రాయెల్. వైద్య పరికరాలతో పాటు పరిశోధకులు, రక్షణ నిపుణులతో కూడిన ప్రత్యేక విమానం సోమవారం భారత్‌కు చేరుకుంది. 'ఆపరేషన్ బ్రీథింగ్ స్పేస్' పేరిట చేపట్టిన ఈ మిషన్‌లో భాగంగా పెద్ద ఎత్తున వెంటిలేటర్లను భారత్‌కు పంపించింది.
"ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ సమయంలో ఒకరికొకరు సాయం చేసుకొని, సంబంధాలు మరింత మెరుగుపర్చుకునేందుకు ఇరుదేశాలకు ఇదో మంచి అవకాశం. కొద్ది నెలల క్రితం ఔషధాలు, అత్యవసర పరికరాలను భారత్ పంపించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేపట్టిన ఈ చర్యలు భారత్‌కు 'కృతజ్ఞత' సంకేతాన్ని ఇస్తుంది."
-గిలాద్ కోహెన్, ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ(ఆసియా పసిఫిక్ విభాగం) డిప్యూటీ డైరెక్టర్
30 సెకన్లలో కరోనా టెస్ట్
భారత్‌కు చేరుకున్న ఇజ్రాయెల్ పరిశోధక బృందం... వేగవంతమైన కొవిడ్-19 టెస్ట్ కిట్‌లను అభివృద్ధి చేయడానికి ఇక్కడి శాస్త్రవేత్తలతో పనిచేయనుంది. టెస్టింగ్ సమర్థతపై 'చివరి దశ' పరిశోధనలను నిర్వహించనుంది. 30సెకన్లలో ఫలితం వచ్చే విధంగా డీఆర్డీఓతో కలిసి పనిచేస్తోంది ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిశోధక బృందం. దీంతోపాటు కరోనా సంక్రమణను వేగవంతంగా నిర్ధారించేందుకు అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు పరిశోధకులు.
మైలురాయి...
పదిరోజుల్లో వేలాది నమూనాలను సేకరించి కృత్రిమ మేథ సాయంతో వాటిని విశ్లేషించనున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను ఇరుదేశాల ప్రభుత్వాల నుంచి తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ప్రయోగాలు ఫలిస్తే కొవిడ్ పోరులో ఓ మైలురాయిని చేరినట్లేనని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా పేర్కొన్నారు. వెంటిలేటర్ల ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ భారత్‌కు తీసుకొచ్చేందుకు నిబంధనలు సడలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరుకు భారత్-ఇజ్రాయెల్ సంయుక్త 'రణం'