Stealth omicron variant: అత్యంత భయానక కరోనా విపత్తుల నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాలు వైరస్‌తో కలిసి జీవించే విధానానికి మళ్లుతుంటే కొవిడ్ పుట్టినిల్లు చైనాను మరో వేరియంట్ అతలాకుతలం చేస్తోంది. వుహాన్‌లో కొవిడ్ వెలుగుచూసింది మొదలు ఇప్పటివరకు ఎప్పుడూ నమోదుకాని సంఖ్యలో చైనాలో కొవిడ్ కేసులు తాజాగా నమోదువుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం స్టెల్త్ ఒమిక్రాన్ రకం కరోనా వేరియంట్. భారత్‌లో మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వైరస్ కంటే స్టెల్త్ ఒమిక్రాన్ రకం వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని షాంఘై ఫుడాన్ విశ్వవిద్యాలయం వ్యాధి నిపుణుడు ఝాంగ్ వెన్‌హాంగ్ తెలిపారు. ఏ ఇతర వేరియంట్‌లతో పోల్చినా స్టెల్త్ ఒమిక్రాన్ వ్యాప్తి వేగం ఎక్కువని ఆయన చెప్పారు.
మరో 1,337 మందికి..
స్టెల్త్ ఒమిక్రాన్ ప్రభావంతో కొద్ది రోజులుగా చైనా ప్రధాన నగరాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం 2వేల కేసులు నమోదుకాగా, సోమవారం కొత్తగా మరో 1337 కేసులు బయటపడ్డాయి. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ కేసులతో అప్రమత్తమైన చైనా పెద్ద నగరాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తోంది. కోటి 70 లక్షల మంది జనాభాతో చైనా టెక్‌హబ్‌గా ఖ్యాతిగాంచిన షేన్‌జేన్ నగరంలో ఆదివారం నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. షాంఘై వంటి అతిపెద్ద నగరాలతో పాటు అనేక రాష్ట్రాల్లోని నగరాల్లో స్థానికంగా లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు.
లాక్‌డౌన్‌లో 90 లక్షల మంది..
కొవిడ్ తీవ్రత దృష్ట్యా అతిపెద్ద నగరమైన షాంఘైలో పాఠశాలు, కార్యాలయాలు, నివాస సముదాయాలనూ మూసివేశారు. జిలిన్ రాష్ట్రంలో మార్చి నెలలోనే దాదాపు ఐదు నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. 90 లక్షల మంది జనాభా ఉన్న చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఉత్తర కొరియా సరిహద్దు నగరం యాంజిని పూర్తిగా దిగ్బంధంలో ఉంచారు. లాక్‌డౌన్ విధించిన నగరాల్లో విడతల వారీగా ప్రజలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిస్తున్నారు.
దాంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం...
చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్ వ్యూహం తమకు తీవ్ర భారంగా మారుతున్నట్లు అక్కడి సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య, ఉత్పత్తి కేంద్రాలపైనా లాక్‌డౌన్ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. షేన్‌జేన్ నగరంలో లాక్‌డౌన్ కారణంగా ఐఫోన్ తయారీ కీలక కేంద్రం కార్యకలాపాలు నిలిపివేసింది. ఫాక్స్‌కాన్, హువావే, టెన్‌సెంట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ కేసులను సున్నాకు తీసుకువచ్చే వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉద్ధృతి విస్తరిస్తూనే ఉంది. పెద్దగా ఫలితాన్నివ్వకపోయినా జీరో కొవిడ్ వ్యూహానికే కట్టుబడి ఉన్నట్లు చైనా అధికారులు, నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: