శ్రీలంక ప్రధానమంత్రిగా మహింద రాజపక్స ఇవాళ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ కొలొంబో కెలానియా ప్రాంతంలోని చారిత్రక బౌద్ధ మందిరమైన రాజమహా విహారాయలో ఈ కార్యక్రమం జరగనుంది.
కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం జరగనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అనంతరం సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపింది.
ఘన విజయం
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మహింద.. అఖండ విజయం సాధించారు. 5 లక్షల వ్యక్తిగత ప్రాధాన్యత ఓట్లను కైవసం చేసుకొని చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో మహింద నేతృత్వంలోని ఎస్ఎల్పీపీ పార్టీ జయభేరీ మోగించింది. రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 225 పార్లమెంట్ స్థానాల్లో సంకీర్ణ పక్షాలతో కలిపి 150 సీట్లను గెలుచుకుంది.
ఇక రాజ్యాంగ సవరణే!
ప్రధానిగా ఎన్నికైన మహిందకు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు అంటూ శనివారం ట్వీట్ చేశారు.
అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి పార్లమెంట్ ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యతలు కల్పించే శ్రీలంక పార్లమెంట్లోని 19 వ సవరణనను రద్దు చేయాలని గొటబాయ ప్రయత్నిస్తున్నారు. అధికారంపై పూర్తి పట్టు సాధించే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోదరుడి నేతృత్వంలోని పార్టీ ఇందుకోసం కావాల్సిన ఆధిక్యాన్ని గెలుచుకుంది.