శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి 359 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్ర ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైన్యం సహకారంతో తాజాగా మరో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 76 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితులను లోతుగా ప్రశ్నిస్తున్న అధికారులు, దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
పోలీసులకు సహకరించేందుకు దేశవ్యాప్తంగా 6,300 మంది సైనికులను మోహరించింది శ్రీలంక ప్రభుత్వం. ఇందులో 1000 మంది వైమానిక సిబ్బంది, 600 మంది నావికాదళ సభ్యులు ఉన్నారని వెల్లడించింది.
కొలంబోకు 40 కి.మీ దూరంలోని పుగోడా మేజిస్ట్రేట్ కోర్టు వద్ద చిన్నపాటి పేలుడు సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ విషయంపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈస్టర్ ఆదివారం నాడు చర్చ్‌లు, హోటళ్లే లక్ష్యంగా వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 9 మంది ఉగ్రవాదాలు ఆత్మాహుతి దాడులకు పాల్పడి, 359 మందిని బలితీసుకున్నారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ నరమేధానికి స్థానిక నేషనల్ తౌవీద్ జమాత్ (ఎన్టీజే) ఉగ్రవాదులే బాధ్యులని శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది.
అయితే ఈ దాడులు తాము చేసినట్లు ఎన్టీజే ప్రకటించుకోలేదు. మరోవైపు శ్రీలంకలో వరుస బాంబు దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) ప్రకటించింది.
ఇదీ చూడండి: సిరియాలో భారీ పేలుడు- 18 మంది మృతి