ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య సోమవారం నాటికి 72.37 లక్షలకు చేరువైంది. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 4.10 లక్షల మంది మరణించారు.
అమెరికాలో 3 వేల కేసులు
అమెరికాలో తాజాగా 3 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితులు సంఖ్య 20 లక్షల 30 వేలకు చేరువైంది. మృతుల సంఖ్య లక్షా 13 వేల 225 మంది మృత్యువాతపడ్డారు.
రష్యాలో 8 వేల కేసులు
రష్యాలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 8,595 మంది వైరస్ సోకింది. ఫలితంగా వైరస్ బాధితుల సంఖ్య 4,85,253కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6 వేల మంది మహమ్మారికి బలయ్యారు.
అత్యధిక మరణాలు
పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 105 మంది మృతి చెందారు. మరో 4,646 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య లక్షా 10 వేలకు చేరువైంది. వీరిలో 71,127 మంది చికిత్స పొందుతుండగా... మరో 35,018 మంది కోలుకున్నారు.
చైనాలో నేడు 24 కరోనా కేసులు
చైనాలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ 24 కొత్త కేసులు బయటపడినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. 21 కేసులు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నాయని తెలిపారు.
సింగపూర్‌లో 218 కేసులు..
సింగపూర్‌లోనూ వైరస్ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 218 మందికి కరోనా సోకింది. వీరిలో 212 మంది విదేశీ కార్మికులని అధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 38,514కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 25కు చేరింది.
దక్షిణ కొరియాలో 38 కేసులు
దక్షిణ కొరియాలోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 35 సియోల్ నగరంలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం కేసులు సంఖ్య 11,852కు చేరింది. డోర్ టూ డోర్ డెలివరీ చేస్తున్న వారి నుంచి కేసులు నమోదవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
దక్షిణ ఆఫ్రికాలో వెయ్యి మంది మృతి..
దక్షిణ ఆఫ్రికాలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటించటమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,879 మంది వైరస్ బారిన పడ్డారు.
ఫ్రాన్స్..
దేశవ్యాప్తంగా సడలింపులు దిశగా అడుగులు వేస్తోంది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జూన్ 25 నుంచి ఈఫిల్ టవర్ సందర్శించేందుకు అనుమతినిచ్చింది.
ఇదీ చూడండి:దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగిటివ్