సింగపూర్‌లో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన ప్రధాని లీ షియాన్ లూంగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అతని సోదరుడు లీ షియాన్ యాంగ్ ప్రతిపక్ష ప్రోగ్రెస్ సింగపూర్ పార్టీ (పీఎస్పీ)లో చేరారు.
కుటుంబ కలహాల కారణంగా తాజా పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆక్స్లీ రోడ్‌లోని లీ షియాన్ సోదరుల తండ్రి, సింగపూర్ తొలి ప్రధాని లీ కువాన్ యూ ఇంటికి సంబంధించి వీరిద్దరి మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది.
డాక్టర్ టాన్ చెంగ్ బాక్ నేతృత్వంలోని పీఎస్పీలో యాంగ్ బుధవారం సభ్యత్వం తీసుకున్నారు. అయితే యాంగ్ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.
ముందే చేరినా..
అయితే యాంగ్ ఎంతో కాలంగా పీఎస్పీలో సభ్యుడిగా ఉన్నారని, కరోనా కారణంగా సభ్యత్వం ఇవ్వలేకపోయామని టాన్ చెంగ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్నెల్ల ముందే..
సార్వత్రికానికి ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలను ప్రతిపాదించారు ప్రధాని లీ షియాన్. టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించిన లీ పార్లమెంట్ రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిట్ జారీ చేయాలని అధ్యక్షుడు హాతలీమా యాకోబ్‌కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం జూన్ 23న ఎన్నికల రిట్‌ను జారీ చేశారు హాతలీమా. జూన్ 30న నామినేషన్ డేగా ఖరారు చేయగా.. జులై 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకునేందుకు ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు.
ఇదీ చూడండి: సింగపూర్ పార్లమెంటు రద్దు- త్వరలో ఎన్నికలు