ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జావా ద్వీపం బలాంగాన్లోని పెర్టామినా చమురు శుద్ధి కర్మాగారంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అక్కడున్న నలుగురు స్థానికులు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరిలించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఎంతమంది గాయపడ్డారనే విషయమై స్పష్టత రాలేదు.
ఈ ఘటనలో కనీసం 20మంది గాయపడి ఉంటారని స్థానిక వార్తాపత్రిక వెల్లడించింది. వారిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపింది. పిడుగులు పడటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు పేర్కొంది.
సోమవారం అర్ధరాత్రి 12:45 గంటల ప్రాంతంలో(భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5గంటలకు) ఈ ప్రమాదం జరిగినట్టు పెర్టామినా తెలిపింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు వందకుపైగా అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి స్థానికులను ఖాళీ చేయించారు అధికారులు. సుమారు వెయ్యి మందికిపైగా బలాంగాన్ వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్టు సమాచారం.
ఇదీ చదవండి: పాక్లో మరో పురాతన ఆలయంపై దాడి!