దక్షిణ కొరియా ప్రముఖ నేత, సియోల్ నగర మేయర్ పార్క్ వోన్ సూన్ అదృశ్యమవడం చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం నుంచి ఆయన కనపడట్లేదని పోలీసులు తెలిపారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. సియోల్ పరిసర ప్రాంతాల్లోనే చివరి సారి ఆయన ఫోన్ సిగ్నల్‌ను గుర్తించామని... ప్రస్తుతం పార్క్ ఫోన్ స్విచాఫ్ అయినట్లు వివరించారు.
కుమార్తె ఫిర్యాదుతో..
పార్క్ కుమార్తె గురువారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తన తండ్రి అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేశారు. ఇల్లు వీడడానికి ముందు ఓ సందేశాన్ని పార్క్ వదిలి వెళ్లారని ఆమె పోలీసులకు చెప్పారు.
పార్క్ గురువారం కార్యాలయానికి రాలేదని సియోల్ నగర పాలక అధికారులు స్పష్టం చేశారు. ముఖ్య అధికారులతో కార్యక్రమాలను అకారణంగా రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రాజకీయ కారణాలా?
సియోల్ నగర మేయర్‌గా వరుసగా 3 సార్లు ఎన్నికైన ఏకైక నేత పార్క్. 2011లో తొలిసారి మేయర్‌గా గెలిచారు. గతేడాది జూన్‌లో మూడో సారి విజయం సాధించారు. పౌర ఉద్యమకారుడిగా, మానవ హక్కుల న్యాయవాదిగా పార్క్‌కు గుర్తింపు ఉంది. దక్షిణ కొరియాలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలకు వ్యాపార సంస్థలు, రాజకీయ నాయకుల మధ్య అవినీతి సంబంధాలే కారణమని బాహాటంగా వ్యాఖ్యానించారు పార్క్. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తరఫున 2022 అధ్యక్ష అభ్యర్థిగా ఆయనే ఉంటారని అందరూ భావిస్తున్నారు.
కోటి మంది జనాభా గల సియోల్ నగరం.. దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారింది. మే నెల మొదట్లో ఆంక్షలు సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
ఇదీ చూడండి: నేపాల్ అధికార పార్టీలో చీలిక తప్పదా?