సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిజ్(85).. ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ సందర్భంగా.. సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు అక్కడి ఆరోగ్య మంత్రి తౌఫిక్ అల్-రబయా.
"మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నుంచి నేటి వరకు ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎంతో సహకరించారు. నేడు.. వైరస్ నుంచి రక్షణ పొందే కరోనా వ్యాక్సిన్ మోతాదునూ తీసుకున్నారు."
- తౌఫిక్ అల్-రబయా, సౌదీ ఆరోగ్య మంత్రి
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఆయన సోదరుడు ఖలీద్ బిన్ సల్మాన్ సహా.. ఇతర సీనియర్ అధికారులు ఇప్పటికే టీకా తొలి మోతాదును తీసుకున్నారు.
లక్ష మందికిపైగా..
ఈ మేరకు.. గల్ఫ్ ప్రాంతంలో ఫైజర్ టీకా వినియోగాన్ని ఆమోదించిన రెండో దేశంగా సౌదీ నిలిచింది. బహ్రెయిన్ ఈ జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకుంది.
అయితే.. సౌదీ వ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి దశలోనూ నిర్దిష్ట జనాభా ఆధారంగా టీకా పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం రియాద్, మక్కా, తూర్పు ప్రావిన్సులోని మూడు వ్యాక్సిన్ కేంద్రాలలో.. ఇప్పటివరకు లక్ష మందికిపైగా వ్యాక్సినేషన్ కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా మొదటి డోసు వేసుకున్న సింగపూర్ ప్రధాని