రష్యాలో కొవిడ్ విజృంభణ(Russia Covid Cases) రోజురోజుకు పెరుగుతోంది! భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ 24 గంటల వ్యవధిలో 1,015 మంది మృతి చెందడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్తగా 33,740 కేసులు(Russia Covid Cases) బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని మాస్కోలో 5,700 మందికి పాజిటివ్‌గా తేలింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 80.60 లక్షల కేసులు నమోదు కాగా.. 2,22,325 మరణాలు సంభవించాయి. కొవిడ్ తీవ్రత(Corona virus in Russia) అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తర్వాత రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది.
వ్యాక్సినేషన్ వేగవంతానికి చర్యలు..
రష్యన్ అధికారులు వ్యాక్సినేషన్(Russia Vaccination) ప్రక్రియను ముమ్మరం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పౌరులకు లాటరీలు, బోనస్‌లు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా జనాభాలో 32 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. మరోవైపు కొవిడ్ ఆంక్షల విషయంలో దేశంలోని ఆయా ప్రాంతాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఇదివరకే ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో దేశంలోని రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ పౌరులకు 'డిజిటల్ కోడ్'ను ప్రవేశపెట్టనున్నట్లు సోమవారం ప్రకటించింది. నవంబర్ నుంచి థియేటర్లకు వెళ్లేందుకు, సమావేశాలు, క్రీడలు ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ కోడ్‌ను తప్పనిసరి చేసింది. వైరస్ నుంచి కోలుకున్నవారికి, వ్యాక్సినేషన్ పూర్తయినవారికి ఈ కోడ్ ఇవ్వనుంది.
ఇవీ చూడండి: