Russia attack Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను 'దాడి' అని పిలవడానికి చైనా నిరాకరించింది. ఆ పదం వాడటం పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆక్షేపించింది. తూర్పు ఉక్రెయిన్‌లో ప్రజలను కాపాడేందుకు సైనిక చర్యను చేపడుతున్నట్లు గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దాంతో ఇరుదేశాల మధ్య సైనిక పోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. కాగా, ఈ పరిణామాలపై చైనా మిత్రదేశం రష్యాను వెనకేసుకొచ్చింది.
'చైనా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇరువర్గాలు సంయమనం పాటించాలి. పరిస్థితులు మరింత దిగజారకుండా నిరోధించాలి' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ అన్నారు. కాగా, బీజింగ్ ఈ చర్యలను ఖండిస్తుందా..? అని చునియింగ్‌కు మీడియా సమావేశంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
అలాగే ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న సైనికచర్యను 'దాడి' అని సంబోధించేందుకు చైనా నిరాకరించింది. ఆ పదం వాడటం పక్షపాత వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఈ సైనిక పోరు వేళ.. ఉక్రెయిన్ లేక రష్యా నేతలను చైనా సంప్రదించిందా..? అని అడగ్గా.. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
కాగా, ఉక్రెయిన్ సంక్షోభానికి చారిత్రక నేపథ్యంతో పాటు ఇతర కారణాలున్నాయంటూ చైనా స్పందించింది. అంతేగాకుండా ఈ వివాదాన్ని పాశ్చాత్య దేశాలు పెద్దది చేసి చూపించినందుకు నిందలు వేసింది. ఈ వివాదంపై చైనా ఇప్పటికే అమెరికా తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఆ దేశం అగ్నికి ఆజ్యం పోస్తోందని మండిపడింది.
ఫిబ్రవరి 16న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని అమెరికా నుంచి ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలకు విరుద్ధంగా రష్యా వెనక్కి తగ్గినట్లే కనిపించినా, అనూహ్యంగా గురువారం యుద్ధం ప్రకటించింది.
ఇదీ చూడండి: ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి- యుద్ధంలో 100 మందికిపైగా మృతి!