గతంలో బ్రిటిష్ పాలనలో ఉన్న హాంగ్కాంగ్.. చైనా పరిపాలనలోకి వచ్చి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'వాన్ చై'లోని కన్వెన్షన్ సెంటర్లో సంబరాలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ వేదిక చుట్టుపక్కల రోడ్లన్నీ దిగ్బంధించారు.
హాంగ్కాంగ్ స్వేచ్ఛను చైనా హరించేందుకు వీలుగా ప్రభుత్వం అడుగులేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు. వారిని అదుపుచేసేందుకు పెద్దఎత్తున పోలీసులను మోహరించింది ప్రభుత్వం. అత్యంత భారీ భద్రత మధ్యే జెండా వందనం చేశారు అధికారులు.
బ్రిటిష్ నుంచి చైనా పాలనకు..
బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న హాంగ్కాంగ్ 1997 జులై 1న చైనా పరిపాలనలోకి వచ్చింది. 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' ద్వారా ఇప్పటికీ ప్రత్యేక పాలన సాగిస్తోంది.
నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్కాంగ్ ప్రజలు ఇటీవలే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దాదాపు వారం రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఆందోళనల అనంతరం ఆ బిల్లును పక్కనబెడుతున్నట్లు హాంగ్కాంగ్ ప్రభుత్వాధికారులు ప్రకటించారు.