రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక 'కిల్లర్' అని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై పుతిన్ స్పందించారు. బైడెన్ వ్యాఖ్యలు అమెరికా వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అమెరికా గతమే నేడు బైడెన్ మాటల్లో ప్రతిబింబిస్తోందని పుతిన్ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబు దాడిని ఎత్తిచూపారు. శ్వేతజాతి అమెరికన్లు- బానిసత్వ పద్ధతిని ప్రోత్సహించేవారని గుర్తుచేశారు. ఇతర దేశాలపై ఆరోపణలు చేయడాన్ని అమెరికా ఇష్టపడుతుందని పుతిన్ ఆరోపించారు.
అమెరికాపౌరుల్లో చాలామంది రష్యాతో శాంతి, స్నేహాన్ని కోరుకుంటారని.. అదెంతో విలువైన విషయమని పుతిన్ తెలిపారు. బైడెన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా.. అమెరికాకు సహకరించేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు.
''అత్యంత బాధాకరమైన వారసత్వం అమెరికా సొంతం. అది చాలా బరువైంది. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' ఉద్యమం అమెరికా వారసత్వానికి నిదర్శనం.''
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు.
బైడెన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఆయన ఇష్టపడట్లేదన్నారు.
ఇదీ చదవండి: పుతిన్ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్