ఇండోనేషియా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రామికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహిస్తూ ఆందోళన బాటపట్టారు అక్కడి విద్యార్థులు, కార్మికులు. పర్యావరణానికి హాని కలిగించే ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో నిరసనకారులు జకర్తాలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించేందు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో ఆందోళనకారులూ వారిపై రాళ్లు రువ్వారు. ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ.. తీవ్ర హింసకు దారితీసింది.
దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగానూ.. గతంలో ఉన్న 79 చట్టాలను సవరిస్తూ నూతన కార్మిక వ్యవస్థను ప్రవేశపెట్టింది విడోడో ప్రభుత్వం. అయితే.. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి అక్కడి విద్యార్థి, కార్మిక సంఘాలు. కొత్త కార్మిక చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం నుంచి మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
రెండు రోజులుగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 209 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: లూయిస్ గ్లక్కు నోబెల్ 'సాహిత్య' పురస్కారం