పాకిస్థాన్ ఆధ్వర్యంలో ఇవాళ సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో సభ్యదేశాల మధ్య మరింత సహకారం పెంపొందించే మార్గాలపై ఈ దక్షిణాసియా దేశాలు చర్చించనున్నాయి.
పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రత్యేక సహాయకుడు జాఫర్ మీర్జా నాయకత్వం వహిస్తారని.. ఆ దేశ విదేశాంగ కార్యాలయం (ఎఫ్ఓ) తెలిపింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు సార్క్ సెక్రటరీ జనరల్ ఎసాలా రువాన్ వీరకాన్ పాల్గొననున్నారు.
మరింత సహకారం...
"కరోనాపై పోరులో సార్క్ దేశాల మధ్య మరింత సహకారం పెంపొందించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. అలాగే వైరస్ నియంత్రణ చర్యల్లో పరస్పరం ఉత్తమ పద్ధతులను అనుసరించడం; జాతీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడం; పరిశోధనలను ప్రోత్సహించడం, సమన్వయం చేసుకోవడం ఈ సమావేశం లక్ష్యం."
- పాక్ విదేశాంగ కార్యాలయం
ప్రమాదపుటంచున
దక్షిణాసియా అధిక జనసాంద్రత గల ప్రాంతం. ప్రపంచంలోని మానవాళిలో ఐదో వంతు ఇక్కడే జీవిస్తున్నారు. సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం ఇక్కడి సమస్య. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలంతా చాలా ప్రమాదంలో ఉన్నారు.
మోదీ నేతృత్వంలో..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్ దేశాలన్నీ కలిసి రావాలని ఇంతకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఫలితంగా ఒక నెల క్రితం సార్క్ దేశాలు మోదీ ఆధ్వర్యంలో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా కరోనాను నియంత్రించడానికి భారత్ తరపున 10 మిలియన్ డాలర్ల అత్యవసర నిధిని అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం.. పలు దేశాలు ఈ నిధికి సహాయాన్ని ప్రకటించాయి.
ఇదీ చూడండి: కిమ్ ఆరోగ్యంపై మౌనం వీడని ఉత్తర కొరియా