కశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సహించలేని పాకిస్థాన్.. భారత్‌పై విమర్శల దాడిని మరింత పెంచింది. ఇకపై భారత్‌తో చర్చలను తాము ఆశించబోమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. గతంలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి స్థాపన కోసం కలిసి పోరాడదామని భారత్‌ను కోరినా వారు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు.
ఈ కారణంగా తాము చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల సైన్యం వ్యవహరిస్తున్న తీరు తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఖండించిన భారత రాయబారి...
అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా ఇమ్రాన్ వ్యాఖ్యలను ఖండించారు. శాంతి స్థాపన కోసం చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఉగ్రవాదుల రూపంలో భారత్ చెడు మాత్రమే ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ విశ్వసనీయమైన, అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని భారత్ ఆశిస్తుందని స్పష్టం చేశారు.
2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ దాడి తర్వాత దాయాది దేశంతో చర్చలకు భారత్ పూర్తిగా దూరంగా ఉంది. ఉగ్రవాదం, చర్చలు ఒకే తాటిపైకి రాలేవనే సూత్రాన్ని పాటిస్తూ వస్తోంది. కశ్మీర్ విషయంలో భారత్ వ్యవహరించిన తీరును అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలని పాక్ విఫలయత్నాలు చేస్తోంది. అది సాధ్యం కాకపోవడం వల్లే పాక్ నేతలు సందర్భం దొరికిన ప్రతిసారీ భారత్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
- ఇదీ చూడండి: 'అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వానికి స్వస్తి'