పాకిస్థాన్-చైనా... ఈ రెండు ఆసియ దేశాల మధ్య ఉన్న మైత్రి ప్రపంచ దేశాలకు తెలిసిన విషయమే. ప్రపంచ దేశాలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా.. చైనా అండతో పాకిస్థాన్ బయటపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు కృతజ్ఞతగా చైనాకు పాకిస్థాన్ కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇందులో మొదటిగా చెప్పుకునేది సీపెక్(చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్). సొంత దేశంలోనే ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత ఎదురవుతున్నా.. పాక్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. తన వద్ద ఉన్న ద్వీపాలను కూడా చైనాకు అప్పజెప్పాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది.
ఏంటి ఈ ఆర్డినెన్స్?
కరాచీకి దక్షిణాన.. బుందల్, భుద్దో అనే రెండు ద్వీపాలు ఉన్నాయి. ఇవి కొంత కాలం ముందు వరకు సింధ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఉండేవి. వీటిని అభివృద్ధి చేసే విషయంపై ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధించిన పీఐడీఏ(పాకిస్థాన్ ఐల్యాండ్ డెవెలప్మెంట్ అథారిటీ) ఆర్డినెన్స్‌పై గత నెలలో సంతకం చేశారు ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.
ఇదీ చూడండి:- గిల్గిత్ బాల్టిస్థాన్‌లో పాక్ సర్కారుకు నిరసన సెగ
ఈ ఆర్డినెన్స్‌పై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. సీపెక్‌లో భాగంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ద్వీపాలను చైనాకు అమ్మేయడానికే పాక్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
సింధ్, బలూచిస్థాన్‌లో నేతలు ఈ ఆర్డినెన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుటటో జర్దారీతో పాటు అనేక మంది రాజకీయ నేతలు ప్రభుత్వ చర్యలను అక్రమమని అభివర్ణిస్తున్నారు. తమ భూములను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అమ్మితే సహించబోమని తేల్చి చెబుతున్నారు.
సేవ్ ఐల్యాండ్స్...
పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'సేవ్ సీ ఐల్యాండ్స్' ఉద్యమాన్ని ప్రారంభించింది పాకిస్థాన్ ఫిషర్‌ఫోక్ ఫోరమ్(పీఎఫ్ఎఫ్). దేశంలోనే అతిపెద్ద మత్య్సకారుల యూనియన్‌గా పేరొందిన ఈ పీఎఫ్ఎఫ్.. ద్వీపాల అమ్మకంపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు సన్నద్ధమవుతోంది.
ఇదీ చూడండి- చైనా-పాకిస్థాన్ మరో కుట్ర- పీఓకేలో క్షిపణి స్థావరాలు
ఈ ఆర్డినెన్స్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు నేషనల్ పార్టీ సెనెటర్ కబీర్ మహ్మద్ షాహీ.
"సింధ్, బలూచిస్థాన్‌లోని తీర ప్రాంతాన్ని కేంద్ర తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. దీని వెనుక పెద్ద పథకమే ఉన్నట్టు కనిపిస్తోంది. గ్వదర్ పోర్టు సహా సీపెక్‌కు సంబంధించిన ఇతర కీలక ప్రదేశాలు తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా పోతుంది."
-- కబీర్ మహ్మద్, నేషనల్ పార్టీ.
'అక్కడ అభివృద్ధే కష్టం..'
ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రాంతాలను అసలు అభివృద్ధి చేయడం కష్టమని పర్యావరణవేత్త జహంగిర్ దుర్రాని అభిప్రాయపడ్డారు. విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం ఇందుకు ముఖ్య కారణమన్నారు.
ఇంత ఆకస్మికంగా ఈ ద్వీపాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడంపై వాషింగ్టన్‌లోని సౌత్ ఏషియా సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ స్టడీస్ సభ్యుడు మోహన్ మాలిక్ అనుమానం వ్యక్తం చేశారు. సీపెక్‌లోని ఇతర ప్రాజెక్టుల కూడా నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో ఇవి సాధ్యపడతాయా? అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:- 'భారత సైన్యంలో విభేదాల సృష్టికి పాక్ కుట్ర'