దిల్లీలోని పాక్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో భారత్ బహిష్కరించటంపై దాయాది దేశం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌కు చెందిన సీనియర్ దౌత్య అధికారికి సమన్లు జారీచేసింది. భారత్ అభియోగాలను ఖండించిన పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ..తమ ఉద్యోగులపై మోపిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. ఏకపక్ష నిర్ణయం ద్వారా భారత్ వియాన్నా ఒప్పందం ఉల్లంఘించిందని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
అంతకుముందు గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డబ్బు ఎరచూపి రక్షణ వ్యవస్థకు సంబంధించిన దస్త్రాలను తీసుకుంటున్న సమయంలో పాక్ ఉద్యోగులిద్దర్నీ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. వారిద్దరూ పాక్ హైకమిషన్‌లో వీసా విభాగంలో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:200 ప్రత్యేక సర్వీసులతో రైళ్లు ప్రారంభం!