కర్తార్‌పుర్ సాహిబ్ కారిడార్‌ను పాకిస్థాన్ పునఃప్రారంభించింది. దేశంలో కరోనా పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారత్ నుంచి భక్తులకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
కరోనా ప్రబలిన నేపథ్యంలో మార్చిలో ఈ కారిడార్‌ను భారత్ మూసివేసింది. అనంతరం పాక్ ప్రభుత్వం సైతం ఈ నడవా మీదుగా రాకపోకలపై నిషేధం విధించింది.
మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్ తాత్కాలికంగా ఈ కారిడార్‌ను ప్రారంభించింది. అయితే భారత్ మాత్రం తనవైపు ఉన్న రహదారిని తెరవలేదు.
4.7 కిలోమీటర్ల పొడవైన ఈ నడవా పాక్‌లోని కర్తార్‌పుర్ నుంచి భారత్‌లోని గురుదాస్‌పుర్‌లో ఉన్న డేరాబాబా నానక్ సాహిబ్‌ను కలుపుతుంది. 2019లో దీని ప్రారంభోత్సవం జరిగింది.