కరోనాతో బ్రిటన్ కకావికలమవుతున్న వేళ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం.. నేటి నుంచి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టనుంది. కరోనా వైరస్ సార్స్-కొవిడ్-2 కోసం ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 'సీహెచ్ఏడీఓఎక్స్1 కొవిడ్-19'ని నేటి నుంచి మనుషులపై పరీక్షించనున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హెన్ కాక్ తెలిపారు.
15 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 500 మంది వరకు ఆరోగ్యవంతులైన వాలంటీర్ల మీద థేమ్స్ వ్యాలీ ప్రాంతంలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో వాలంటీర్ల భద్రత, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. వచ్చే వేసవిలో 5 వేల మంది మీద ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
చింపాజీల నుంచి..
చింపాజీల్లోని ఎడినో వైరస్ వ్యాక్సిన్ వెక్టార్- 'సీహెచ్ఏడీఓఎక్స్1 కొవిడ్-19'ని పునఃసంయోగం ద్వారా ఈ వ్యాక్సిన్‌ని రూపొందిస్తున్నారు. చింపాజీఎడినో వైరస్ వ్యాక్సిన్ వెక్టార్‌లో అంతర్గతంగా కరోనా వైరస్ జన్యుక్రమంలోని కొమ్ముల వంటి ప్రొటీన్ ఉంటుంది. ఈ కొమ్ముల తరహా వ్యవస్థను కలిగిన వ్యాక్సిన్ ద్వారా మనుషుల్లో రోగనిరోధకశక్తి పెరిగి కరోనా వైరస్ నుంచి కాపాడుతుందని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వైరస్‌కు ప్రతి రూపకల్పన కానందున ఔషధం తీసుకున్న వాళ్లలో వైరస్ ప్రబలే అవకాశం లేదని చెబుతున్నారు.
ఎడినో వైరస్ వెక్టార్లపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయని, హెచ్ఐవీ వ్యాక్సిన్ ట్రయల్స్‌తో పాటు అనేక ఇతర వ్యాధులకు సంబంధించి పరీక్షించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జనవరిలో వైరస్ జన్యు క్రమాన్ని ప్రపంచం ముందు చైనా ఉంచినప్పటిప్పటి నుంచి.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఉన్న శాస్త్రవేత్తలు గతంలో మెర్స్‌కు కూడా వ్యాక్సిన్‌ను కనిపెట్టారు.
ఆ వ్యాక్సిన్ తీసుకున్న ఏడాది తర్వాత శరీరంలో సంబంధిత వైరస్‌ను నిరోధించేలా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతున్నట్లు తేలింది. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ వ్యాక్సిన్‌లు అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని మెర్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.