అనుకున్నంత పనీ అయింది. అఫ్గాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది. ముష్కరుల ధాటికి స్వయంగా ఆ దేశాధ్యక్షుడే పలాయనం చిత్తగించారు! ఇక మిగిలింది- తాలిబన్లు లాంఛనప్రాయంగా అధికార పగ్గాలు చేపట్టడమే. అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్‌లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు. దేశ రాజధాని కాబూల్‌ను ఆక్రమించారు. దీంతో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'గా దేశం పేరు మారుస్తామని వారు ప్రకటించారు. మరోవైపు- తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌లో జనం బెంబేలెత్తుతున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మెరుపు దాడులతో ఆక్రమణల పర్వాన్ని కొనసాగించిన తాలిబన్లు దాదాపు వారం రోజుల వ్యవధిలోనే అఫ్గాన్ మొత్తాన్నీ హస్తగతం చేసుకోవడం గమనార్హం.
అఫ్గాన్ రాజధాని కాబూల్ సమీపంలోకి శనివారం నాటికే వచ్చేసిన తాలిబన్లు.. ఆదివారం దాని శివార్లలోకి చేరుకున్నారు. అన్నివైపుల నుంచీ నగరాన్ని చుట్టుముట్టారు. అయితే తమ సహజ స్వభావానికి విరుద్ధంగా శాంతిమంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నుంచి శాంతియుతంగా అధికారాన్ని దక్కించుకోవాలని భావించారు. షరతులేవీ విధించకుండా ప్రభుత్వం తమకు లొంగిపోవాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా చర్చలు జరిపేలా.. తమ రాయబారులను అధ్యక్షుడి భవనానికి పంపించారు. ప్రభుత్వం తరఫున అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, జాతీయ రాజీ మండలి (ఎన్‌ఆర్‌సీ) అధినేత అబ్దుల్లా అబ్దుల్లా చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం దేశాధ్యక్ష భవనంలోకి తాలిబన్ ఫైటర్లు ప్రవేశించారు.
హాని తలపెట్టబోమంటూ హామీ
కాబూల్ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు తాలిబన్లు ప్రయత్నించారు. తాము ఇళ్లలోకి చొరబడబోమని, వ్యాపార కార్యకలాపాల్లోనూ జోక్యం చేసుకోబోమని ఓ ప్రకటనలో హామీ ఇచ్చారు. అఫ్గాన్ ప్రభుత్వం, విదేశీ బలగాల తరఫున పనిచేసినవారికి క్షమాభిక్ష ప్రసాదిస్తామని భరోసా ఇచ్చారు.
ఏటీఎంల ముందు బారులు
తాలిబన్ల అధీనంలోకి కాబూల్ వెళ్లడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముష్కరులు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తీవ్రస్థాయి ఆంక్షలను విధించే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును ఉపసంహరించుకునేందుకు ఏటీఎంల ముందు ప్రజలు ఆదివారం బారులు తీరారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో రద్దీ ఎక్కువగా కనిపించింది. ఉగ్ర దాడుల్లో ఇళ్లు కూలిపోతాయేమోన్న భయంతో పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో వేలమంది గుమిగూడారు. ఇతర దేశాలతో అఫ్గాన్ సరిహద్దులన్నీ ప్రస్తుతం తాలిబన్ల అధీనంలోనే ఉన్నాయి. ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వాయుమార్గం మాత్రమే అందుబాటులో ఉంది.
కీలక పత్రాలను బూడిద చేసి..
తాలిబన్లు కాబూల్ శివార్లకు చేరుకోగానే అమెరికా అప్రమత్తమైంది. నగరంలోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బంది తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. హెలికాప్టర్లలో వారిని విమానాశ్రయానికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి విమానాల్లో పలువుర్ని స్వదేశానికి తరలించింది. అంతకుముందు- తాలిబన్ల చేతికి చిక్కకుండా ఉండేందుకుగాను సున్నితమైన దస్త్రాలను అమెరికా అధికారులు కాల్చిబూడిద చేశారు. పలు ఇతర దేశాలూ తమ సిబ్బందిని సురక్షితంగా వెనక్కి రప్పించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. మరోవైపు- అఫ్గాన్ నుంచి తమ పౌరులను సురక్షితంగా వెనక్కి రప్పించే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదనంగా మరో వెయ్యి మంది అమెరికా సైనికులను ఆ దేశానికి పంపించనున్నట్లు ప్రకటించారు. తరలింపు ప్రక్రియల్లో వారు పాలుపంచుకుంటారని చెప్పారు. మొత్తం 5 వేలమంది సైనికులను అఫ్గాన్‌లో అమెరికా మోహరించనుంది.
సరిహద్దును మూసేసిన పాక్
అంతకుముందు, నంగర్హర్ ప్రావిన్సు రాజధాని జలాలాబాద్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. అక్కడి గవర్నర్ కార్యాలయంలోకి ప్రవేశించి సంబంధిత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. జలాలాబాద్‌లో ప్రతిఘటన ఏదీ చోటుచేసుకోలేదని.. అధికారులు స్వచ్ఛందంగా లొంగిపోయారని నంగర్హర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. మైదాన్ వర్దక్ రాజధాని మైదాన్ షార్ సహా మరికొన్ని నగరాలూ తాలిబన్ల వశమయ్యాయి. పాకిస్థాన్‌తో సరిహద్దుల్లోని తొర్ఖామ్‌నూ హస్తగతం చేసుకున్నారు. ఆ వెంటనే తొర్ఖామ్ వద్ద సరిహద్దు కేంద్రాన్ని పాక్ మూసివేసింది.
బగ్రామ్ వైమానిక స్థావరమూ..: ఆక్రమణల పర్వంలో భాగంగా బగ్రామ్ వైమానిక స్థావరాన్నీ తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ బలగాలు ఎలాంటి పోరాటం లేకుండానే లొంగిపోయాయి. ఆ వైమానిక స్థావరంలో తాలిబన్లు, ఐఎస్‌ఐఎస్ సహా పలు ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 5 వేల మంది ఖైదీలున్నారు.
బలహీనుడై.. ఒంటరివాడై..
తాలిబన్లపై పోరాటానికి తొలుత గట్టిగానే ప్రయత్నించిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. అమెరికా బలగాల ఉపసంహరణ కారణంగా బాగా బలహీనపడ్డారు. వారం రోజులుగా ముష్కరుల దూకుడును అడ్డుకోవడానికి యత్నించి విఫలమయ్యారు. తనకు సంపూర్ణ సహకారం అందించాలంటూ ఇటీవల కొందరు సైనిక ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. అయితే వారిలో కొందరు తాలిబన్లకు లొంగిపోయారు. మరికొందరు దేశం విడిచి పారిపోయారు. దీంతో ఘనీ ఒంటరయ్యారు. చివరకు దేశం విడిచి వెళ్లారు. జాతీయ భద్రత సలహాదారు హమ్దుల్లా మొహిబ్, మరో సన్నిహితుడితో కలిసి ఆయన పలాయనం చిత్తగించారు. ఘనీ ఏ దేశానికి వెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు.
సమన్వయ మండలి ఏర్పాటు
తాలిబన్లు ఆక్రమించినా.. కాబూల్ సురక్షితంగా ఉంటుందని అఫ్గాన్ మంత్రి అబ్దుల్ సతార్ మిర్జాకావల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. తాలిబన్ల నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అధికారాలు అప్పగించే అవకాశముందని తెలిపారు. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు సమన్వయ మండలిని ఏర్పాటుచేసినట్లు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించారు. అధికార బదిలీ శాంతియుతంగా జరిగేలా చూసుకుంటామన్నారు. అమెరికా బలగాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని పడగొట్టకముందు.. అఫ్గాన్ పేరు 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'గా ఉండేది. ప్రస్తుతం ఆ దేశానికి మళ్లీ అదే పేరు రానుంది. తాలిబన్ల పొలిటికల్ బ్యూరో అధినేత ముల్లా అబ్దుల్ ఘనీ అఫ్గాన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కాబూల్ నుంచి తరలింపులకు సిద్ధం: భారత్
కాబూల్‌లో ఉన్న వందల మంది భారతీయ అధికారులు, సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రణాళికలను భారత్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. "కాబూల్‌లో పరిస్థితులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. అక్కడి రాయబార కార్యాలయంలో ఉన్న ఏ ఒక్కరి ప్రాణాలకూ ముప్పు ఏర్పడనివ్వబోం. అందర్నీ సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అత్యవసర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి" అని ఓ అధికారి తెలిపారు.
గంటసేపు గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం
ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానమొకటి కాబూల్ విమానాశ్రయం వద్ద ఆదివారం గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. 40 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి ఆ విమానం కాబూల్ చేరుకుంది. అక్కడ ల్యాండ్ అయ్యేందుకు 'ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)' నుంచి అనుమతి రాలేదు. దీంతో గంటసేపు అక్కడక్కడే గాల్లో తిరుగుతూ ఉంది. అనంతరం ల్యాండ్ అయ్యింది. తొలుత ఎందుకు అనుమతి లభించలేదో తెలియరాలేదు.
ఇదీ చూడండి: దేశాన్ని వీడిన అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ!