వరుస క్షిపణి ప్రయోగాలతో యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఉత్తర కొరియా(Missile Test North Korea) .. తాజాగా మరో మిసైల్‌ను పరీక్షించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విమాన నిరోధక క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ వార్త సంస్థ తెలిపింది. శత్రు దేశాల విమానాలు, రాడార్లను అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. గత కొంత కాలంగా క్షిపణి ప్రయోగాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un news) కొద్ది రోజుల నుంచి తన దూకుడును పెంచారు. వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ చిరకాల ప్రత్యర్థులు దక్షిణ కొరియా, అమెరికాలపై ఒత్తిడి పెంచుతున్నారు.
దక్షిణ కొరియా హెచ్చరిక..
క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తున్న ఉత్తరకొరియాకు తన సైనిక సంపత్తిని ప్రదర్శించటం ద్వారా దక్షిణ కొరియా (South Korea News) గట్టి హెచ్చరికలు పంపింది. సాయుధ దళాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ద. కొరియా తమ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది. భూమి, నీరు, ఆకాశంలో.. ఆ దేశ బలగాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తమ ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే ఎలాంటి ప్రయత్నాలనైనా సమర్థవంతంగా తిప్పికొడతామని.. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (Moon Jae-In North Korea) స్పష్టం చేశారు. శాంతి సుస్థిరతకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామని పరోక్షంగా ఉత్తరకొరియాకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి : 'చైనా భూభాగం దురాక్రమణకు భారత్ కుట్ర.. అందుకే ఉద్రిక్తత!'