తమకు ముప్పు తలెత్తితే బలమైన అణ్వస్త్ర బలగాలను పూర్తిస్థాయిలో మోహరించి తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ ఆవిర్బావ వేడుకలను శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర కొరియా ఘనంగా నిర్వహించుకుంది. దీని వీడియోను శనివారం విడుదల చేశారు. భారీ సైనిక కవాతులో ఈ మేరకు శత్రు దేశాలకు పరోక్ష హెచ్చరికలు పంపారు.
" శత్రు శక్తుల నుంచి పెరుగుతున్న అణ్వాయుధ బెదిరింపులతో సహా అన్ని ప్రమాదకరమైన ప్రయత్నాలు, బెదిరింపు చర్యలను అరికట్టడానికి, స్వీయ ఆత్మరక్షణ కోసం మేము యుద్ధ నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసే చర్యలను కొనసాగిస్తాము. "
- కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత.
దక్షిణ కొరియాకు శుభాకాంక్షలు తెలిపారు కిమ్. కరోనా మహమ్మారి నుంచి పొరుగు దేశం త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ నుంచి దేశాన్ని, తమను రక్షించుకుంటున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పునరుద్ఘాటించారు కిమ్.
భారీ ఆయుధాల ప్రదర్శన..
డౌన్ నగరంలో ఉత్తర కొరియా భారీ సైనిక కవాతు నిర్వహించినట్లు దక్షిణ కొరియా మీడియా నివేదించింది. అధికార వర్కర్స్ పార్టీ ప్రతి ఐదవ, పదవ వార్షికోత్సవాల్లో దేశ సైనిక శక్తిని చూపించే అతిపెద్ద కవాతులు నిర్వహిస్తుంది. శుక్రవారం నిర్వహించిన పరేడ్లో అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ (ఐసీబీఎం), జలాంతర్గముల నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ క్షిపణులు(ఎస్ఎల్బీఎం), ఇతర భారీ ఆయుధాలను ప్రదర్శించినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: శత్రు దేశానికి ఉత్తర కొరియా హెచ్చరిక.. కారణం ఇదే!