కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని న్యూజిలాండ్(Lockdown extension in New Zealand) నిర్ణయించింది. శుక్రవారం వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వైరస్ కేసులు అధికంగా ఉన్న ఆక్లాండ్‌లో ఈ నెల చివరి వరకు లాక్డౌన్ ఉంటుందని ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కొత్తగా 35 కరోనా కేసులు వెలుగులోకి(New Zealand new Covid cases) వచ్చాయి. గతేడాది ఏప్రిల్ తర్వాత రోజువారీ అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఇందులోనూ ఎక్కువగా డెల్టా వేరియంట్(Delta variant in New Zealand) కేసులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గత మూడు రోజుల్లో దేశ జనాభాలో 3 శాతం మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపారు.
సుదీర్ఘ విరామం తర్వాత గత వారం ఓ వైరస్ కేసు బయటపడగా.. అప్పటి నుంచి 107 ఇన్ఫెక్షన్ కేసులను గుర్తించారు అధికారులు. వైరస్ సోకిన రోగులకు సన్నిహితంగా మెలిగినవారి సమాచారాన్నీ సేకరించారు. కరోనా వ్యాప్తిని తప్పక అడ్డుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలో
మరోవైపు, లాక్‌డౌన్‌పై ఆస్ట్రేలియాలో(Lockdown in Australia) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెల్టా వేరియంట్ వ్యాప్తిని లాక్డౌన్ పూర్తిగా నివారించలేదని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్(Australia PM Scott Morrison) పేర్కొన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని నెమ్మదించేలా చేసేందుకే ఆంక్షలు ఉపయోగపడతాయని చెప్పారు. వ్యాక్సినేషన్ రేటు 80 శాతం దాటితే.. రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను తెరవాలని సూచించారు. అయితే, ఇప్పటివరకు దేశంలోని 24 శాతం మంది ప్రజలకే కరోనా టీకా రెండు డోసులు అందాయి.
కాగా, సిడ్నీలో కరోనా కేసుల సంఖ్య 800 మేర పెరిగింది. మెల్బోర్న్లో 71, కాన్బెర్రాలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ నగరాలన్నీ లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి.
ఇదీ చదవండి: 'టీకా ధ్రువపత్రం ఉంటేనే రెస్టారెంట్లోకి ఎంట్రీ'