చైనా-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బ తీసేందుకు అగ్రరాజ్యంలోని కొన్ని రాజకీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఈ నూతన ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయికి చేరడానికి అమెరికా ప్రయత్నిస్తోందని.. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ బీజింగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇది ఇరు దేశాలకు ప్రమాదకరమైందని వాంగ్ యీ అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలో ఇరుదేశాలు ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికి పరస్పర సహకారంతో ముందుకెళ్లడానికి శాంతియుత మార్గాన్ని కనుగొనాలని వాంగ్ యీ సూచించారు. హాంకాంగ్, మానవ హక్కులు, వాణిజ్యం, తైవాన్‌కు అమెరికా సహకారం వంటి విషయాల్లో ఇరుదేశాలు తలబడుతున్న సమయంలోనే.. కరోనా వైరస్ విజృంభణతో వీటి మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
ఈ సందర్భంలో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాలు నూతన విధానాలను రూపొందించుకోవాలని వార్షిక మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. ఈ కీలకమైన సమయంలో అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తొలుత ఇరుదేశాలు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలను ఒకరినొకరు పంచుకొని మహమ్మారిపై కలిసి పోరాడాలన్నారు. ఈ సమయంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: అమెరికా సహా వారందరివీ పగటి కలలు: చైనా