నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.. భారత్‌పై చేసిన విమర్శలు బెడిసికొట్టాయి. తనను పదవి నుంచి తప్పించేందుకు భారత దౌత్య కార్యాలయం కుట్ర చేస్తోందన్న ఓలి వ్యాఖ్యలకు సొంత కమ్యూనిస్ట్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేయాలని పార్టీలోని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బలువతార్‌లోని ప్రధాని నివాసంలో అధికార పార్టీ సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని కమల్ దహాల్ ప్రచండ.. ఓలి తీరును తప్పుబట్టారు.
"తనను తప్పించడానికి భారత్ కుట్ర పన్నుతోందన్న ఓలి ఆరోపణలు రాజకీయంగాను, దౌత్యపరంగాను నిజం కాదు. ప్రధాని వ్యాఖ్యలు.. పొరుగు దేశంతో ఉన్న మంచి సంబంధాలను దెబ్బతీస్తాయి. దీనితో పాటు సొంత పార్టీ సభ్యులను కూడా ఓలి విమర్శించడం సరైనది కాదు. ప్రధాని తాను చేసిన వ్యాఖ్యలు నిజమని రుజువుచేయాలి. లేకపోతే నైతిక విలువలతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి."
-- కమల్ దహాల్ ప్రచండ, నేపాల్ మాజీ ప్రధాని
భేటీలో పాల్గొన్న ఓలి మాత్రం.. సొంత పార్టీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు.
అయితే పదవికి రాజీనామా చేయాలని పార్టీ సభ్యులు ఓలిపై ఒత్తిడి తీసుకురావడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్‌లోనూ ఇదే విధంగా ఓలిపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు పార్టీ సభ్యులు.
భారత్‌తో కయ్యం...
గత కొంత కాలంగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది నేపాల్. భారత భూభాగాలను తమ వంటూ ఓ మ్యాప్‌ను రూపొందించి, దానికి ఆ దేశ పార్లమెంట్ చేత ఆమోద ముద్రవేయించుకుంది. దీంతో ప్రధాని ఓలి వైఖరిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనను గద్దెదించడానికి భారత్ యత్నిస్తున్నట్టు ఆరోపించారు ఓలి.
ఇదీ చూడండి:- సరిహద్దు వివాదంపై నేపాల్ వైఖరికి కారణమేంటి?