నేపాల్ ప్రధానమంత్రి ఓలి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ కో-ఛైర్మన్ పుష్ప కుమార్ దహల్ ప్రచండ మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలను తొలగించేందుకు అధికార కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు 9 మందితో కూడిన కేంద్ర సెక్రటేరియట్ సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయనుంది. స్టాండింగ్ కమిటీ సమావేశం ఆదివారానికి వాయిదా పడటం వల్ల ఈ కీలక భేటీ నిర్వహించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది.
"45 మంది సభ్యుల స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముందు ఈ అత్యున్నత భేటీ నిర్వహించేందుకు ఓలి, ప్రచండ ఒప్పుకున్నందున నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ.. సెక్రటేరియట్ సమావేశానికి పిలుపునిచ్చింది."
-సూర్య థాపా, నేపాల్ ప్రధాని ప్రెస్ సెక్రటరీ
గత కొంతకాలంగా నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో అభిప్రాయభేదాలు ఎక్కువైపోయాయి. పార్టీలోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఆకస్మికంగా రద్దు చేయడం, పొరుగుదేశాలపై అనవసర ఆరోపణలు చేయడం వల్ల ప్రధాని ఓలిపై పార్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పార్టీ నియమాలకు విరుద్ధంగా ఓలి రెండు పదవులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తోటి సభ్యులు. ప్రధాని పదవి, లేదంటే పార్టీ ఛైర్మన్ పదవిని వదులుకోవాలని పట్టుపడుతున్నారు. అయితే ఇందుకు ఓలి నిరాకరిస్తున్నారు.
గత కొద్ది రోజుల నుంచి ఓలి, ప్రచండల మధ్య జరుగుతున్న అనధికార చర్చలు సైతం విఫలమవుతున్నాయి. అయినప్పటికీ చర్చలకు మరో అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఇదీ చదవండి- నేపాల్లో వీడని సస్పెన్స్- ఓలి భవితవ్యం తేలేది ఆదివారమే!