నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి! తమ మద్దతు ఉపసంహరించుకుంటామని సీపీఎన్-మావోయిస్టు సెంటర్ ప్రకటించిన క్రమంలో.. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ) ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేసింది. మావోయిస్టు సెంటర్‌తో పాటు జనతా సమాజ్‌వాదీ పార్టీ(జేఎస్‌పీ) నేతలతో ఇప్పటికే చర్చలు ఆరంభించింది. తాజాగా.. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా నివాసంలో మూడు పార్టీల చర్చలు సానుకూలంగా జరిగినట్టు స్థానిక వార్తాపత్రిక వెల్లడించింది. 'ఓలీని రాజీనామా చేయాలని కోరతాం. అందుకు ఆయన అంగీకరించకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం' అని ఎన్సీ సీనియర్ నేత ప్రకాశ్ మాన్ సింగ్ వెల్లడించారు.
అక్కడి నుంచే చిచ్చు ప్రారంభం...
గత డిసెంబరులో ప్రతినిధుల సభను ఓలీ రద్దు చేయడం సహా.. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్-మావోయిస్టు సెంటర్ ఓలీ సర్కారుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఏ క్షణమైనా ఆ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునే వీలుంది. అదే జరిగితే, ఓలీ... జేఎస్‌పీ మద్దతు తీసుకోవడమో, అధికారానికి దూరం కావడమో తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కిరీటం లాక్కున్న 'మిసెస్ వరల్డ్' అరెస్ట్