నేపాల్ పార్లమెంట్ రద్దయింది. ఏ కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనందున ప్రతినిధుల సభను రద్దు చేస్తూ నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 12, 19న మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి ఓలి.. పార్లమెంట్‌ను రద్దు చేయాలని అధ్యక్షురాలిని కోరారు. తొలి విడత ఎన్నికలు నవంబర్ 12న, రెండో విడత నవంబర్ 19న నిర్వహించాలని మంత్రివర్గం సూచించింది. ఇందుకు అనుగుణంగా అధ్యక్షురాలి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ ఏర్పాటు కోసం షేర్ బహదూర్ దేబా, కేపీ శర్మ ఓలి శర్మ చేసిన అభ్యర్థనలను భండారీ తోసిపుచ్చారు. ఇరువురిలో ఎవరినీ తాము ప్రధానిగా నియమించలేమని నోటీసులో పేర్కొన్నారు.
మ్యాజిక్ ఫిగర్ 136
275 మంది సభ్యులు ఉండే నేపాల్ పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో నలుగురు చట్టసభ్యులు పార్టీ మారినందుకు ఉద్వాసనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆధిక్యం కోసం 136 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఓలి, విపక్ష పార్టీలు ముందుకొచ్చాయి. తమకు మద్దతుగా ఉన్న నేతల పేర్లతో అధ్యక్షురాలికి లేఖను సమర్పించాయి. అయితే, కొంతమంది నేతల పేర్లు ఇరువురి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
రెండోసారి
ప్రధాని సూచనల మేరకు పార్లమెంట్‌ను రద్దు చేయడం ఇది రెండో సారి. గతేడాది డిసెంబర్లో పార్లమెంట్‌ను రద్దు చేశారు భండారీ. అయితే ఆ దేశ సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఈ ఆదేశాలను నిలిపివేసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన విపక్ష కూటమి