దాదాపు రెండు నెలల పాటు మౌనంగా ఉన్న ఉత్తర కొరియా మరోమారు క్షిపణుల ప్రయోగం చేపట్టింది. స్వల్ప లక్ష్యాల్ని ఛేదించగల రెండు క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ధ్రువీకరించింది.
ఆగస్టులో అమెరికా-దక్షిణ కొరియా మిలటరీ ప్రదర్శనలు ఉన్న నేపథ్యంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి సాహసించిందని అనుమానిస్తున్నారు. అణు నిరాయుధీకరణ చర్చలపై ప్రభావం పడుతుందని హెచ్చరించేందుకే ప్రయోగించారని భావిస్తున్నారు.
ఉత్తర కొరియా స్థానిక కాలమానం ప్రకారం మొదటి క్షిపణిని ఉదయం 5:34, రెండోది 5:57 గంటల సమయంలో వోన్సాన్ నుంచి తూర్పు సముద్రంవైపు ప్రయోగించింది. ఈ క్షిపణులు సుమారు 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని దక్షిణ కొరియా ప్రకటించింది.
ఉత్తర కొరియా చివరగా స్వల్ప లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మే 9న ప్రయోగించింది. అమెరికా అధ్యక్షుడు జూన్ 30న దక్షిణ కొరియాలోని డీఎంజడ్ (సైన్య రహిత జోన్)లో కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయ్యారు. అణు నిరాయుధీకరణపై చర్చలు పునఃప్రారంభించారు. అనంతరం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగం చేపట్టలేదు ఉత్తర కొరియా.
ఇదీ చూడండి: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ బాధ్యతల స్వీకరణ