మయన్మార్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలపై ఆ దేశ సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు కొనసాగిస్తోంది. దక్షిణ మయన్మార్‌లో సోమవారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు సైన్యం చేతిలో 50 మంది బలైనట్లు ఐరాస మానవ హక్కుల విభాగం తెలిపింది.
అయితే, సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు అక్కడి ప్రజలు. మయన్మార్‌లోని అతిపెద్ద నగరమైన యాంగూన్‌లో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. కర్ఫ్యూను ధిక్కరిస్తూ రోడ్లపైకి చేరుకున్నారు. భద్రతా బలగాలు నిర్బంధించిన 200 మంది విద్యార్థులకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు.
ఈ అరాచకాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలను అణచివేస్తోంది సైనిక ప్రభుత్వం. ఐదు మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఎటువంటి సమాచారాన్ని, ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా సహకారం నిలిపివేత
మయన్మార్‌కు సైనిక సహకారం నిలిపివేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. పౌర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడం, ఆస్ట్రేలియా పౌరుడిని నిర్బంధించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆ విదేశాంగ మంత్రి మేరిస్ పేన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
"మయన్మార్ సైన్యం మా దేశానికి చెందిన ప్రొఫెసర్ సీన్ టర్నెల్‌ను నిర్బంధంలోకి తీసుకుంది. టర్నెల్‌కు మా దౌత్యవేత్తతో మాట్లాడేందుకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదు. అక్కడి మా దౌత్యవేత్తలు రెండు పర్యాయాలు మాత్రమే టర్నెల్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌కు మేం అందిస్తున్న 1.2 మిలియన్ డాలర్ల విలువైన రక్షణపరమైన శిక్షణా కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాం. అంతేకాకుండా నిర్బంధంలో ఉన్న సీన్ టర్నెల్‌ను వెంటనే విడుదల చేయాలి. ఆయనతో పాటు మయన్మార్ నేతలైన ఆంగ్‌సాన్ సూకీని కూడా విడుదల చేసి పౌర ప్రభుత్వాన్ని నెలకొల్పాలి."
-మేరిస్ పేన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి
మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీకి సలహాదారుగా వ్యవహరించేందుకు సీన్ టర్నెల్ ఈ ఏడాది ప్రారంభంలో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది వారాలకే అక్కడి నేత ఆంగ్‌సాన్ సూకీని నిర్బంధించి ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది. అనంతరం టర్నెల్‌ను కూడా నిర్బంధంలోకి తీసుకుంది.
ఇదీ చదవండి: రాజస్థాన్‌లో దొరికిన పాక్ గూఢచర్య డివైజ్!