మయన్మార్‌లో అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకోవటాన్ని నిరసిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సైన్యం కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో ఆందోళనలను ఉద్ధృతం చేశారు ప్రజాస్వామ్య అనుకూలవాదులు. సోమవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం సైన్యం ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. నిరసనలను అణచివేసేందుకు సైనిక శక్తిని వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకునేలా కనిపిస్తోంది.
సోమవారం రోజు తేదీలోని 'రెండు' అంకెలను సూచిస్తూ.. ఐదు రెండ్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయాలని కోరింది శాసనోల్లంఘన ఉద్యమ బృందం.
సైన్యం హెచ్చరిక..
సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వటంపై హెచ్చరికలు చేసింది సైన్యం. ప్రజలు ఆందోళనలు విరమించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంది.
" ఫిబ్రవరి 22న పెద్ద ఎత్తున ఆందోళనలు, అల్లర్లు సృష్టించాలని నిరసనకారులు పిలుపునిచ్చినట్లు తెలిసింది. ఆందోళనకారులు ప్రజలను, ముఖ్యంగా యువత, టీనేజర్లను రెచ్చగొట్టి వారి జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. నిరసనల్లో అల్లర్లు సృష్టించేందుకు క్రిమినల్ గ్యాంగ్‌లు ఉన్నాయి. దాని కారణంగా భద్రతా దళాలు కాల్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. "
- మయన్మార్ అధికార మీడియా
మయన్మార్‌లోని అతిపెద్ద నగరం యాంగూన్‌లో ఆదివారం రాత్రి భారీ ట్రక్కులు వీధుల్లోకి వచ్చి ఓ ప్రకటన చేశాయి. సోమవారం జరిగే ఆందోళనల్లో ప్రజలు పాల్గొనకూడదని స్పష్టం చేశాయి. ఐదుగురికన్నా ఎక్కువ మందిపై నిషేధానికి కట్టుబడి ఉండాలని సూచించాయి.
యువతికి ఉద్యమ వీడ్కోలు..
అంతకు ముందు ఆదివారం మయన్మార్ రాజధానిలో బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువతి అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు నిరసనకారులు. శనివారం చనిపోయిన ఇద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శ్మాశాన వాటికలోకి వచ్చిన క్రమంలో యువతికి మూడు వేళ్లతో సెల్యూట్ చేసి సంతాపం ప్రకటించారు.
ఇదీ చూడండి: మయన్మార్: యువతి మృతితో ఆందోళనలు ఉద్ధృతం