ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా కేసులు 20లక్షల 75 వేలు దాటాయి. వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య లక్షా 34 వేలు దాటింది. మహమ్మారి నుంచి 5 లక్షల 9వేల మంది కోలుకున్నారు. మరణించిన వారిలో మూడింట రెండు వంతుల మంది ఐరోపాకు చెందిన వారే కావటం అక్కడ వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది. యూరప్ వ్యాప్తంగా దాదాపు 90 వేల మంది మృత్యువాతపడ్డారు.
అమెరికాలో...
కరోనా కేసుల విషయంలో దేశాల వారీగా పరిశీలిస్తే అమెరికానే మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 28 వేల మందికి పైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 6,41,000 దాటింది. న్యూయార్క్‌లోనే 2 లక్షల కేసులు నమోదవగా.. 10 వేల మంది మరణించారు. అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో మహమ్మారి ధాటికి 2,569 మంది బలయ్యారు.
ఇటలీలో తగ్గుముఖం..
ఇటలీలో కరోనా మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 578 మంది మృతి చెందారు. మరో 2,667 కేసులు నమోదయ్యాయి.
చైనాలో 46 కేసులు..
చైనాలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఒక్కరోజే 46 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఓ వ్యక్తి మహమ్మారికి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో పెరిగిన మరణాలు..
ఫ్రాన్స్‌లో మళ్లీ కరోనా మరణాలు పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 1438 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 4,560 మంది వైరస్ బారిన పడ్డారు.