ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు రష్యా మద్దతు పలకడాన్ని తోసిపుచ్చింది చైనా. ఈ అంశంలో సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొంది. అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయనున్నట్లు స్పష్టం చేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. బుధవారం దిల్లీ వచ్చిన సందర్భంగా యూఎన్ఎస్సీలో భారత్, బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు తెలిపారు. భారత్‌కు పూర్తి అర్హత ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం యూఎన్‌లో సంస్కరణలు చేపట్టాలని సూచించారు.
సెర్గీ వ్యాఖ్యలను తోసిపుచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్.
" ఈ అంశంపై సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. సంస్కరణపై ఏకాభిప్రాయం లేదు. చర్చలు, సంప్రదింపుల ద్వారా అన్ని పార్టీల ప్రయోజనాలు, ఆందోళనలకు అనుగుణంగా ఉండే ప్యాకేజీ పరిష్కారాన్ని కనుగొనడానికి చైనా ఇతర సభ్యులతో కలిసి పనిచేయాలనుకుంటుంది."
- జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ ప్రతినిధి.
ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై తనకు ఉన్న వీటో అధికారంతో అడ్డుపడుతూ వస్తోంది చైనా. దాని ప్రధాన మిత్రదేశమైన పాకిస్థాన్ కూడా వ్యతిరేకిస్తోంది. అయితే 2021-22 మధ్య భారత్ తాత్కాలిక సభ్య దేశంగా ఉండేందుకు మద్దతు పలికింది చైనా.
భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్.. జీ4 కూటమిగా ఏర్పడి.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
ఇదీ చూడండి: ట్రంప్ భారత పర్యటనపై ఇరాన్ ప్రభావమెంత?