పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనలో ప్రధాన నిందితుడిని అక్కడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి పేరు ఫైజుల్లా అని, కరాక్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నామని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రధాన పోలీస్ అధికారి సనావుల్లా అబ్బాసి వెల్లడించారు. అల్లరి మూకలను ప్రేరేపించి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయించిన కేసులో ఫైజుల్లానే సూత్రధారి అని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 110 మందిని అరెస్టు చేసినట్లు అబ్బాసి తెలిపారు.
ఇదీ చదవండి : పాక్లో హిందూ ఆలయాన్ని కూల్చిన అల్లరిమూక
గతవారం రాడికల్ ఇస్లామిక్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
కూల్చిన గుడిని పునర్నిర్మిస్తామని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పాక్ సూప్రీంకోర్టు కూడా హిందూ గుడిని పునర్నిర్మించాలని ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది.