శ్రీలంక నూతన ప్రధానిగా మహీంద రాజపక్స ప్రమాణం స్వీకారం చేశారు. 2020లో లంక సార్వత్రిక ఎన్నికలు జరిగేంత వరకు అపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపనున్నారు.
బుధవారం విక్రమ సింఘే ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం మహీందకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కీలక ప్రకటన చేశారు. 2005 నుంచి 2015 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద రాజపక్స.. 2018లో ఓసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహీంద రాజపక్స సోదరులు. గతంలో 2018లోనూ ప్రధాని బాధ్యతలు నిర్వహించారు మహీంద. అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయనను నియమించారు. ఆ తర్వాత లంకలో తలెత్తిన రాజ్యాంగ సంక్షోభం కారణంగా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు మహీంద.
1970లో 24ఏళ్లకే ఎంపీగా గెలిచి అతిపిన్న వయసులో లంక పార్లమెంటులో అడుగుపెట్టిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు మహీంద రాజపక్స.
మోదీ శుభాకాంక్షలు..
శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహీంద రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రమిది