శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లతో ఆ దేశ ఉన్నతాధికారులు పదవులను కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంక రక్షణ కార్యదర్శి, ఐజీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. నిఘా వర్గాల సమాచారం ఉన్నప్పటికీ బాంబు పేలుళ్లను నివారించడంలో విఫలమైనందున ఐజీ జయసుందరతో పాటు రక్షణ కార్యదర్శి ఫెర్నాండోలు బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఇదే విషయాన్ని సిరిసేన సలహాదారు షిరల్ లక్తిలక ధ్రువీకరించారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఐజీని విధుల నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపారు.
వరుస పేలుళ్ల తర్వాత శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన మంగళవారం మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 24 గంటల్లో రక్షణ విభాగంలోని ఉన్నత పదవుల్లో మార్పులుంటాయని ప్రకటించారు. నిఘా వర్గాల సమాచారమున్నప్పటికీ రక్షణ అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు సిరిసేన తెలిపారు.
ముందుగానే హెచ్చరించిన ఎన్ఐఏ
శ్రీలంకలో ఐసిస్ దాడులు జరిగే ప్రమాదముందని ముందుగానే హెచ్చరించినట్లు భారత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. కోయంబత్తూర్లో ఐసిస్ ఉగ్రసంస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోందన్న కేసును ఈ నెల ఆరంభంలో దర్యాప్తు పూర్తి చేసింది ఎన్ఐఏ. ఈ విచారణలో బయటపడిన సాక్ష్యాలతో శ్రీలంకలోని చర్చిలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశముందని కూడా తెలిపినట్లు ప్రకటించింది.