జపాన్ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా మళ్లీ ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో పార్లమెంట్ సభ్యులు కిషిడా (kishida fumio) ప్రధాని పదవి చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన నేతలతో కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
నెల క్రితమే ప్రధానిగా ఎన్నికైన కిషిడా.. పార్లమెంట్ దిగువ సభను (kishida fumio) రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిషిడా ప్రాతినిథ్యం వహిస్తున్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ.. 465 మంది సభ్యులు గల పార్లమెంట్ దిగువ సభలో 261 సీట్లు సాధించింది. ఈ ఫలితంతో కిషిడా పూర్తిస్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగింది.
64 ఏళ్ల కిషిడా గతంలో జపాన్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. జపాన్‌కు సుదీర్ఘ కాలంపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన షింజో అబే అనారోగ్య కారణాలతో గతేడాది ఆగస్టు నెలలో ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 72ఏళ్ల యోషిహిడే సుగా ఏడాది గడవక ముందే పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. మరోసారి ఈ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని తెలిపారు. సుగా చేసిన అనూహ్య ప్రకటన ఆయన పార్టీతో పాటు జపాన్ రాజకీయాల్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో ఫుమియో కిషిడాకు భారీ మద్దతు లభించింది. ప్రధాని పదవి చేపట్టాక దిగువసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఫుమియో కిషిడా పూర్తి మెజార్టీతో విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని మళ్లీ దక్కించుకున్నారు.
ఇదీ చూడండి : పెళ్లి చేసుకున్న మలాలా.. పాక్ క్రికెట్ బోర్డ్ మేనేజర్‌తో...