Green House Farming In North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. తన దేశ ప్రజల ఆహారపు ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా తొలి అడుగు వేశారు. ఉత్తర కొరియాలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. భారీగా వచ్చిన సైనికుల మధ్య మంచుతో పేరుకుపోయిన మట్టిని బాంబులతో పేల్చి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.
శీతాకాలంతో తాజా కూరగాయలు లభించక ఉత్తరకొరియన్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య కూరగాయల సాగు సాధ్యం కాదు. దీన్ని అధిగమించేందుకు ఎలాంటి వాతవరణంలోనైనా ఏడాదంతా పండే కూరగాయల సాగుకు కిమ్ సంకల్పించారు. కొన్నేళ్ల నుంచి దీనికి ప్రణాళికలు రచిస్తున్న కిమ్ జోంగ్.. అంతర్జాతీయ, స్థానిక సంస్థల సహకారంతో ఏడాది పొడవునా కూరగాయలు పండించే గ్రీన్‌హౌస్ ఫామ్ హౌస్ నిర్మాణానికి పూనుకున్నారు.
ఉత్తర కొరియన్లు చలి కాలంలో తాజా కూరగాయలు లేకుండానే జీవిస్తారు. తాజా కూరగాయలకు బదులుగా పచ్చళ్లు, ఎండిన కూరగాయాలపై ఆధారపడతారు. శీతాకాలంలో వీటిని తినడం వల్ల ఉత్తరకొరియన్ల ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్నాయి.
ఆరోగ్య ప్రమాణాలు పెంచాలని సంకల్పించిన కిమ్.. గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు. మామూలుగా ప్రధాన నిర్మాణ ప్రాజెక్టుల కోసం మాత్రమే ఉపయోగించే సైన్యాన్ని కిమ్ ఈ వ్యవసాయ క్షేత్ర పనికి ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి భూమి పూజ చేసి వెనుదిరిగిన కిమ్‌ను.. సైనికులు అభిమానంతో చుట్టుముట్టారు. వేల సంఖ్యలో సైనికులు చుట్టుముట్టగా.. కిమ్ వాహనం ముందుకు కదిలేందుకు చాలా సమయం పట్టింది. దారి ఇవ్వాలంటూ కిమ్.. సైనికులకు చాలాసేపు సైగ చేశారు. చివరకు కొంతమంది సైనికులు సహకరించగా.. ఉత్తరకొరియా అధినేత వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: మరో రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి: బైడెన్