సరిహద్దుల్లో భారత సైన్యాన్ని నిలువరించేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ చైనా ప్రయత్నిస్తోంది. ఇది వరకే భారత సైన్యం దెబ్బ రూచి చూసిన బీజింగ్... మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను సైన్యంలోకి చేర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం... టిబెట్ పరిధిలోని 18 నుంచి 21 ఏళ్ల విద్యార్థులకు గాలం వేస్తోంది. రెండేళ్ల పాటు సైనిక శిక్షణ తీసుకుంటే... రెండేళ్ల పాటు పాఠశాల, కళాశాల ఫీజును చెల్లిస్తామంటూ సెల్‌ఫోన్‌లకు సందేశాలు పంపిస్తోందని టిబెట్ మీడియా పేర్కొంది.
కళాశాల విద్యలో ఆర్మీ శిక్షణ..
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో సైనిక శిక్షణను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని చైనా హుకుం జారీ చేసింది. శిక్షణ అనంతరం చదువు కొనసాగించవచ్చని తెలిపింది. ఆర్మీ శిక్షణను పాఠశాల, కళాశాల విద్యలో డ్రాగన్ భాగం చేసింది. రెండేళ్ల సైనిక శిక్షణ కోర్సు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 15.. చివరి గడువని బీజింగ్ పేర్కొంది. శిక్షణ తీసుకున్న వారిని అవసరమైన సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించి సైనిక కార్యకలాపాల కోసం వినియోగించాలని డ్రాగన్ భావిస్తోంది.
సవాలుగా వాతావరణం..
గల్వాన్ ఘర్షణల అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా..పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. భారత్‌తో సరిహద్దుల్లో భాగంగా.. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలతో చైనా సరిహద్దు కలిగి ఉంది. లద్ధాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో గడ్డకట్టించే చలి, మంచు సహా కఠిన పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైన్యానికి అక్కడి వాతావరణం ఇది సవాలుగా మారింది. ఐతే.. గతేడాది లద్ధాఖ్‌లో జరిగిన ఘర్షణల సందర్భంగా భారత సైన్యానికి చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్.. డ్రాగన్ సేనలను సమర్థంగా నిలువరించింది. దీంతో ఈ దళంలో ఉన్న టిబెటియన్ల శక్తి సామర్థ్యాలను గుర్తించిన చైనా ఈ కుటిల యత్నానికి తెరతీసింది.
పరిస్థితులను తట్టుకునేలా..
టిబెట్ యువతను సైన్యంలో చేర్చుకొని వారిని భారత సరిహద్దుల్లో మోహరించేలా చైనా కుట్రలు పన్నుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ.. భారత్‌పై వారిని ఉసిగొల్పాలని చూస్తోంది. సైన్యంలో టిబెటియన్ల నియామకంతో డ్రాగన్‌కు అనేక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా టిబెట్ యువత చైనాను ఆమోదిస్తారని.. ఇదే సమయంలో లద్ధాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో పనిచేసే చైనా సైనికుల మీద ఒత్తిడి తగ్గుతుందని డ్రాగన్ భావిస్తోంది.
ఇవీ చూడండి: