Israel fourth dose: ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించేందుకు ప్రజలకు కరోనా టీకా నాలుగో డోసు ఇవ్వాలని భావిస్తోంది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా మొదట 150మంది ఆరోగ్య సిబ్బందికి సోమవారం ఫైజర్ టీకా నాలుగో డోసు ఇచ్చింది. ఈ డోసుతో మరింత రక్షణ లభిస్తుందో లేదో ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఒకవేళ నాలుగో డోసు తీసుకున్నవారికి బలమైన రక్షణ లభిస్తుందని తేలితే దేశ ప్రజలందరికీ ఈ డోసు ఇవ్వనుంది. దీనిపై ఆరోగ్య శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.
ట్రయల్స్‌లో భాగంగా శెబా మెడికల్ సెంటర్లో 150మంది వైద్య సిబ్బందికి నాలుగో డోసు వేశారు. వీరిలో యాంటీబాడీల స్థాయి తగ్గిందని పరీక్షల్లో తెలిసినందున మరోసారి బూస్టర్ డోసు ఇచ్చారు. వీరంతా ఈ ఏడాది ఆగస్టులోనే బూస్టర్ డోసు(మూడో డోసు) తీసుకున్నారు.
నాలుగో డోసుతో ఒమిక్రాన్ నుంచి రక్షణ లభిస్తుందని ఈ ట్రయల్స్‌తో తేలుతుందని తాము భావిస్తున్నట్లు వైద్య నిపుణుడు ప్రొఫెసర్ జాకబ్ లావీ తెలిపారు. కచ్చితంగా యాంటీబాటీలు, టీ సెల్స్ మరింత వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. నాలుగో డోసు తీసుకున్న వారి ఫలితాలను పరిశీలిస్తే దీనిపై స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు.
Israel booster dose news
ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు మొత్తం 13లక్షల 6వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 8,242మంది మరణించారు. మొత్తం 93 లక్షల జనాభా గల ఈ దేశంలో 42లక్షల మందికి ఇప్పటికే ఫైజర్ టీకా బూస్టర్ డోసు ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నాలుగో డోసు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: రెండేళ్లలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైన దేశాలేవో తెలుసా?