అమెరికా భద్రతా దళాలను తమ దేశం నుంచి బహిష్కరించాలనే తీర్మానానికి ఇరాక్ పార్లమెంటు ఆమోదం పలికింది. దేశంలోని విదేశీ సైనికుల రాకకు స్వస్థి పలకాలని పిలుపునిచ్చిన తీర్మానానికి అనుకూలంగా చట్టసభ సభ్యులు మద్దతు పలికారు. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 5,000 మంది అమెరికా దళాలను ఉపసంహరించుకోవడం ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం.
అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది ఇరాక్. ఇస్లామిక్ స్టేట్ గ్రూపునకు వ్యతిరేకంగా పోరాడేందుకు సాయపడటానికి.. అమెరికా నాలుగేళ్ల క్రితం ఇరాక్‌కు దళాలను పంపిన ఒప్పందానికి ముగింపు పలకాలని ఇరాకీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ తీర్మానానికి పార్లమెంటులో మెజారిటీ స్థానాలు కలిగిన షియా సభ్యులు మద్దతు పలికారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. సున్నీ, కుర్దిష్ శాసన సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
అమెరికాపై ఐరాసకు ఫిర్యాదు
అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ సులేమానీతో పాటు స్థానిక దళాలు చనిపోయిన నేపథ్యంలో.. అమెరికాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు సమర్పించినట్లు ఇరాక్ తెలిపింది. బాగ్దాద్‌పై అమెరికా చేసిన దాడిలో సులేమానీ హత్యను ఖండించాలని ఐరాసకు నివేదించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.