గల్ఫ్ తీరంలో అక్రమంగా ఇంధన రవాణా చేస్తోందని ఆరోపిస్తూ ఓ విదేశీ ట్యాంకర్ను, అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు.
ఇంతకు ముందు... ఆ విదేశీ ట్యాంకర్ను ధ్వంసం చేస్తామన్న హెచ్చరికలు రావడం కారణంగా సహాయం చేయడానికి వచ్చామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఓడను స్వాధీనం చేసుకున్నట్లు తెలుపలేదు. తాజాగా ఆ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ట్యాంకర్ పేరు, తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
అత్యంత సున్నితమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఆదివారం ఇరాన్ దళాలు ఓ నౌకను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుత ప్రకటనలోని నౌక, ఆదివారం నాటిది ఒకటేనా, కాదా అన్నది ఇరాన్ స్పష్టం చేయలేదు.
"2 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యం, 12 మంది విదేశీ సిబ్బందితో ఈ నౌక, ఇరాన్ పడవల నుంచి అందుకున్న నిషేధిత ఇంధనాన్ని, దూరప్రాంతాల్లోని విదేశీ నౌకలకు పంపించే మార్గంలో ఉంది."- సెపాన్యూస్ వెబ్సైట్ (ఇరాన్ సైన్యం)
పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఘటన జరిగింది.
ఇదీ చూడండి: స్టూడియోకు నిప్పు: 33కు చేరిన మృతులు