అమెరికా సైనికులందరినీ ఉగ్రవాదులుగా గుర్తించింది ఇరాన్ పార్లమెంట్. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ దేశ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. తమ దేశ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే రివల్యూషనరీ కుద్స్ ఫోర్స్ విభాగాధిపతి జనరల్ సులేమానీ హత్యకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి : అంతిమ యాత్రలో తొక్కిసలాట- 35 మంది మృతి
పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం.. అమెరికా సైనికులు, పెంటగాన్‌తో పాటు దాని అనుసంధాన సంస్థల ఉద్యోగులు, సులేమానీ హత్యలో భాగమైన ఏజెంట్లు, కమాండర్లను ఇరాన్ తీవ్రవాదులుగా పరిగణించింది. యూఎస్ సైన్యానికి ఎలాంటి సాయం చేసినా... ఉగ్రవాదులకు సహకరించినట్లుగానే పరిగణిస్తామని ఆ దేశ పార్లమెంట్ స్పష్టం చేసింది.
సులేమానీ నేతృత్వంలో నడిచిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కుద్స్ ఫోర్స్‌కు ఆర్థిక కేటాయింపులను 200 మిలియన్ యూరోలకు పెంచేందుకు ఇరాన్ చట్టసభ సభ్యులు అంగీకారం తెలిపారు.