నేపాల్ లాంటి చిన్న దేశంపైనా చైనా ఆక్రమణలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని భారత నిఘా వర్గాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. నేపాల్ సరిహద్దు రాళ్లను ముందుకు జరుపుతూ చైనా సైన్యం దురాక్రమణలకు పాల్పడుతోందని వివరించాయి. ఏడు సరిహద్దు జిల్లాల్లో ఈ విధంగా ఆక్రమణలు జరుపుతోందని, ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలిపాయి.
'కావాలనే దాచిపెడుతోంది':
చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా నేపాల్‌లో అధికారంలో ఉన్న నేపాలీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, దాన్ని దాచిపెడుతున్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ సర్వే వర్గాలు ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలికి వివరించినట్లు తమ నివేదికలో వివరించాయి. సరిహద్దు జిల్లాలైన దోలఖ, గోర్ఖా, దార్చులా, హుమ్లా, సింధుపాల్‌చౌక్, శంఖు వాసబ, రసువా జిల్లాల్లో ఆక్రమణల సమస్య అధికంగా ఉంది.
సరిహద్దు రాళ్లను జరుపుతూ..
దోలఖ జిల్లాలోని కోర్లంగ వద్ద 57వ నెంబరు సరిహద్దు రాయిని జరిపి 1500 మీటర్లు ముందుకు వచ్చింది. గోర్ఖా జిల్లాలో రుయి గ్రామం వద్ద 35, 37, 38 నెంబర్ల సరిహద్దు రాళ్లను కూడా ఇలాగే జరిపింది. ఇవన్నీ తోమ్ నది వద్ద ఉన్నాయి. ఈ గ్రామస్థులు నేపాల్ ప్రభుత్వానికే పన్నులు చెల్లిస్తున్నారు.
చర్చలకు సుముఖంగా లేదు..
చైనా మాత్రం 2017లోనే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని టిబెట్‌లో భాగంగా చూపిస్తోంది. సంపా భంజయాంగ్ వద్ద 62న నెంబరు రాయిని కూడా ముందుకు జరిపింది. కనీసం 11 చోట్ల ఆక్రమణలకు పాల్పడినట్లు నేపాల్ వ్యవసాయ శాఖ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. భగడారే, హుమ్లా, కర్నాలి, సంజెన్, లెమ్డె, భుర్జుగ్, ఖరానే, జంబు, అరుణ్, ఖమ్కోలా నదుల పరివాహక ప్రాంతాల్లో ఈ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. ఇవి తెలిసినా కూడా చైనాతో చర్చలు జరిపేందుకు నేపాల్ సుముఖంగా లేదు. 2005 నుంచి అసలు సరిహద్దు చర్చలే జరగలేదు.