ఇండోనేసియా రాజధాని నుంచి పోంటియానక్‌కు బయలుదేరిన శ్రీవిజయ బోయింగ్ విమానం.. జకార్తాలోని థౌజెండ్ ద్వీపాల ప్రాంతంలో కూలిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి. జాలర్లు ఈ విమాన శకలాలను గుర్తించినట్లు స్థానిక మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో విమానాశ్రయంలో ప్రయాణీకుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
కొనసాగుతోన్న ఆపరేషన్..
మొత్తం 62 మంది ప్రయాణికులతో జకార్తా నుంచి బయల్దేరిన బోయింగ్ 737 విమానం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు జకార్తా నుంచి బయలుదేరింది. 90 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఇండోనేసియా రవాణా శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ బోయింగ్ విమానం కోసం సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా.. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్టు ఇండోనేసియా రవాణా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
ప్రమాదాలు సాధారణం..
ఇండోనేసియాలోని పోంటియానక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 737-500 విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం జకార్తాలో టేకాఫ్ అయిన 12 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో విషాదం నింపింది. ఇండోనేసియాలో రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటంతో అక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భద్రతా ప్రమాణాలు సైతం అంతంతగా ఉండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: గజగజా వణుకుతూ.. మంచులో విహరిస్తూ..