కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి ఇంకా ఒకే రోజు ఉంది. దర్బార్ సాహిబ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరమా? లేదా? అనే విషయంపై గందరగోళం నెలకొన్న తరుణంలో స్పష్టత ఇచ్చింది పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం. భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరం లేదని పేర్కొంది. పాస్‌పోర్ట్ నిబంధనను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒక సంవత్సరం పాటు సడలించారని తెలిపింది.
అంతకుముందు భారత సిక్కు యాత్రికులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలని పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ వెల్లడించారు. ఆయన ప్రకటనతో పాస్‌పోర్ట్ అంశంపై గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో.. గురునానక్ 550వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత సిక్కు యాత్రికులకు పలు నిబంధనలు సడలిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ తెలిపారు.
" 10 రోజుల ముందుగానే యాత్రికుల వివరాలను పాక్ ప్రభుత్వానికి అందించే నిబంధనతో పాటు నవంబర్ 9, 12 తేదీల్లో ప్రవేశం రుసుం 20 డాలర్లను చెల్లింపును తొలగిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఈ విషయాన్ని తాము అధికారికంగా భారత్‌కు తెలిపాం. శనివారం రోజున కర్తార్‌పుర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత్‌తో పాటు ప్రపంచ దేశాల నుంచి సుమారు 10 వేల మంది సిక్కు యాత్రికులు హాజరవుతారని అంచనా. ఒప్పందం ప్రకారం ప్రతిరోజు భారత్ నుంచి 5వేల మంది యాత్రికులు వస్తారు. ఇతర దేశాలకు కూడా ఇదే సంఖ్యలో వీసాలు జారీ చేయనున్నాం."
-మహమ్మద్ ఫైజల్, పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి.
కర్తార్‌పుర్ కారిడార్ పూర్తయినట్లు ఈనెల 1న పాక్ ప్రధాని ఖాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాస్‌పోర్ట్, 10 రోజుల ముందు భారత సిక్కు యాత్రికులు వివరాలు తెలియజేయాలన్న నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. పాస్‌పోర్ట్ అవసరం లేదని.. చలామణిలో ఉన్న గుర్తింపు కార్డు సరిపోతుందన్నారు.
ఒప్పందం ప్రకారమే..
పాస్‌పోర్ట్‌పై పాకిస్థాన్ మిశ్రమ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉందని.. ఈ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఇది అవసరమైన పత్రాలను తెలుపుతోందని... ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్ పాస్‌పోర్ట్‌పై స్పష్టత ఇవ్వని పాక్