భారత చైనా మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో... టిబెట్ సమస్య గురించి మాట్లాడాలని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ నాయకుడు లోబ్సాంగ్ సంగే కోరారు. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు టిబెట్ కూడా ఓ కారణమని... అందుకే టిబెట్‌ను ప్రధాన సమస్యల్లో ఒకటిగా భావించాలని సంగే పేర్కొన్నారు.
తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ఇరుదేశాలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల్లో టిబెట్ సమస్యను భారత్ లేవనెత్తాలని సంగే కోరుతున్నారు.
భారత్ అదే చెప్పాలి!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత-చైనాల మధ్య టిబెట్ ఓ బఫర్ జోన్లా ఉండేదని... అయితే టిబెట్‌ను చైనా ఆక్రమించడం వల్ల భారత్ భారీ ముల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు సంగే. పంచశీల ఒప్పందంతో చైనా మోసపూరిత చర్యలకు బీజాలు పడ్డాయన్నారు. టిబెట్ ప్రధాన సమస్య అని చైనా చెబుతోందని.. భారత్ కూడా అదే చెప్పాలన్నారు సంగే.
"చైనాకు టిబెట్ చాలా ప్రధానమైంది. భారత్‌కు కూడా అంతే ప్రధానమైంది. ఉద్రిక్తతల కారణంగా ఈ రెండు దేశాలు ఇప్పటివరకు అనేక సార్లు ద్వైపాక్షిక చర్చలు జరిపాయి. ఈసారి టిబెట్ సమస్యను భారత్ లేవనెత్తాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత్ నాయకత్వం వహించాలి."
-లోబ్సాంగ్ సంగే
ప్రవాస టిబెటన్ ప్రభుత్వం
ధర్మశాల ప్రవాస టిబెటెన్ ప్రభుత్వానికి కేంద్రం. ప్రముఖ ఆధ్యాత్మక గురువు దలైలామాకు కూడా అదే నివాసస్థానం. అయితే 1959లో ఆయన టిబెట్ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చేశారు. చైనా వ్యతిరేక తిరుగుబాటుకు మద్దతు ప్రకటించిన ఆయనపై డ్రాగన్ కత్తికట్టడమే అందుకు కారణం.
ఇదీ చూడండి: అమెరికా ఎన్నికల సిత్రం- 'మా నాన్నకు ఓటేయ్యొద్దు'