కరోనా వైరస్ పేరుతో ప్రజల పట్ల చైనా అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా వాయవ్య ప్రాంతమైన షిన్జియాంగ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలను భౌతికంగా ఇళ్లల్లో లాక్డౌన్ చేయడం, కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయడం సహా.. నిర్బంధంలో ఉన్న వారిపై ఎసిడిక్ క్రిమి సంహారకాలను చల్లుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే అరెస్టు చేస్తున్నారు.
సాధారణంగా 14-17రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు కొనసాగిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అయితే షిన్జియాంగ్లో మాత్రం అది 40రోజుల కన్నా ఎక్కువ. దీనితో పాటు... సంప్రదాయ చైనా మందులను బలవంతంగా అక్కడి ప్రజలకు ఇస్తున్నారు. ఎలాంటి క్లినికల్ డేటా లేకుండా.. మందును బెదిరించి ప్రజలకు ఇవ్వడం.. వైద్య నీతికి విరుద్ధమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నోటీసులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, షిన్జియాంగ్లో క్వారంటైన్లో ఉన్న ముగ్గురితో జరిపిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి.
కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తనను నిర్బంధించినట్టు ఓ వీగర్ జాతి మహిళ తెలిపింది. తన చేత బలవంతంగా ఓ మందును తాగించారని పేర్కొంది. ఆ తర్వాత తన శరీరం నీరసించిపోయిందని, వికారం పెరిగిందని వివరించింది. నిర్బంధ గదిలో ఉన్న తనను వారానికి ఓసారి గార్డులు నగ్నంగా నిల్చోబెట్టి, క్రిమిసంహారకాలను చల్లతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీని వల్ల చర్మం ఊడివచ్చేస్తోందని చెప్పింది.

ఇక్కడే ఎందుకు?
షిన్జియాంగ్లో వీగర్లు, కజఖ్లు, ఇతర మైనారిటీ వారు నివాసముంటున్నారు. వీరు ఎన్నో ఏళ్లుగా బీజింగ్ పాలన నుంచి స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై పెద్ద స్థాయిలో నిఘా పెట్టింది ప్రభుత్వం. మూడేళ్లుగా వీరిలో చాలామంది నిర్బంధంలోనే ఉంటున్నారు.
నిజానికి వైరస్ పుటినిల్లు వూహాన్లో కూడా ఇంతటి కఠిన నిబంధనలను అమలు చేయాలేదు చైనా. కానీ జూన్ నుంచి 826 కేసులు వెలుగు చూసిన కారణంతో షిన్జియాంగ్లో ఈ స్థాయిలో కఠిన చర్యలు చేపడుతోంది. అయితే వారం రోజులుగా ఒక్క కేసు కూడా బయటపడనప్పటికీ.. ఈ స్థాయిలో చర్యలు చేపట్టడం గమనార్హం.
నిర్బంధ కేంద్రాలు వీడి ఇళ్లకు చేరిన వారిని కూడా అధికారులు వదిలిపెట్టడం లేదు. ఇళ్లకు వెళ్లి మరీ లేబుల్ లేని సీసాలు ఇచ్చి బలవంతంగా వారి చేత తాగిస్తున్నారు.
అయితే.. ప్రజల భద్రత, ప్రాణాల కోసమే ఈ విధంగా చర్యలు చేపడుతున్నట్టు చైనా విదేశాంగ ప్రతినిధి జియో లిజియన్ చెప్పారు.
మరోవైపు హాన్ నివాసితులపైనా ఇదే విధమైన చర్యలు చేపట్టింది చైనా. వైరస్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారిని కూడా నిర్బంధిస్తోంది. కఠిన నిబంధనలపై సామాజిక మాధ్యమాల్లో అక్కడి వేలాది మంది ప్రజలు పోస్టులు చేశారు. ప్రజలకు సంకెళ్లు వేసి ఉండటం, ఇళ్ల తలుపులను లోహపు కడ్డీలతో సీల్ చేసి ఉంచడం ఆ ఫొటోల్లో కనపడ్డాయి. తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో అక్కడ కొంతమేర ఆంక్షలను సడలించింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:- చైనా శాటిలైట్ డేటాతో కశ్మీర్‌పై పాక్ నిఘా!