ప్రజాస్వామ్య ఉద్యమాలతో కొన్ని నెలలుగా హోరెత్తుతున్న హాంకాంగ్‌లో నేడు జిల్లా ఎన్నికలు జరగనున్నాయి. హాంకాంగ్ భవిష్యత్తును మార్చేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ దేశ ప్రజలు సన్నద్ధమవుతున్నారు.
హాంకాంగ్‌లో సాధారణంగా జిల్లా ఎన్నికలకు హడావిడి చాలా తక్కువ. బస్ స్టాండ్లు ఏర్పాటు చేసే స్థలాలు, నగర సుందరీకరణ వంటివి ఈ ఎన్నికల్లో ముఖ్య అంశాలు. కానీ దేశంలో నెలకొన్న తాజా పరిణామాల వల్ల.. ఈ జిల్లా ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో లక్షలాది మంది పాల్గొంటున్నారు. వీరి ఆగ్రహజ్వాలలను.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఓట్లుగా మల్చుకుంటారా లేదా అన్నదే అసలైన పరీక్ష.
ఓటింగ్ జరిగేనా..?
ఎన్నికల అభ్యర్థులపై అనేక మార్లు దాడులు జరిగాయి. పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాలతో ఎన్నో ప్రచార కార్యక్రమాలు అర్థాంతరంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆందోళనల ప్రభావం.. జిల్లా ఎన్నికలపై పడతాయని అనేక మంది భయపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం.. ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకారం జరిగేలా తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించనట్టు వివరించింది.